Saturday, February 14, 2009

భజంత్రీలు.. వాయించండి...

భజంత్రీలు.. వాయించండి...

ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుండటంతో న్యూస్‌ పేపర్స్‌, ఛానల్స్‌ ఆఫీసులన్నీ కళ కళలాడుతున్నాయి. అందరూ తలో పార్టీనీ భుజాన వేసుకొని పరిగెత్తటానికి శక్తిని కూడగట్టుకుంటున్నారు. మేధావులుగా పేరుమోసిన జర్నలిస్టులు శూన్యం లోకి చూస్తూ మేధోమథనం చేసినట్లు కనిపించటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఆఫీసుల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవటానికి మా అజ్ఞాత టీం బయలుదేరి వెళ్లింది. అక్కడ అనేక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. వాటిని ఏ మాత్రం ఎడిట్‌ చేయకుండా మీ ముందు ఉంచుతున్నాం. ఆస్వాదించండి..


ఈనాడు సోమాజీగూడా ఆఫీసు..ఎండీ కిరణ్‌ బాబు రూమ్‌..

కిరణ్‌ తలెత్తకుండా కనిపించిన ప్రతి పేపర్‌ మీద సంతకాలు పెడతున్నాడు. ఇంతలో జనరల్‌ మేనేజర్‌ రాజేంద్ర బాబు తలుపు తోసుకొని వచ్చేశాడు. కిరణ్‌ని చూడగానే.. "బాబూ.. '' అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు డోర్‌ బయట కూర్చుని దొంగచూపులు చూస్తున్న డీఎన్‌ ఉలిక్కి పడ్డాడు. "బాబూ.. మీరు చెక్‌లు అనుకొని న్యూస్‌పేపర్ల మీద సంతకాలు పెట్టేస్తున్నారు..''అన్నాడు రాజేంద్ర ప్రసాద్‌. కిరణ్‌ తలెత్తి చూశాడు. ఏం మాట్లాడలేదు. ఓటమిని ఒప్పుకోవటం ఇష్టలేనట్లు ఇంకో రెండు కాగితాల మీద సంతకాలు పెట్టేశాడు. ఇంతలో ఉత్కంఠను తట్టుకోలేని న్యూస్‌ కోఆర్డినేటర్‌ డీఎన్‌ తలుపుతోసుకొని వచ్చేశాడు. "ఏమైంది సర్‌.. మళ్లీ సీఎం టీవీలో కనబడ్డాడా?'' అంటూ.. కిరణ్‌ సర్దుకొని కూర్చున్నాడు. "ఆర్‌బీకి ఓ పరీక్ష పెట్టా.. డీఎన్‌.. వెంటనే పట్టేశాడు..నే న్యూస్‌పేపర్ల మీద సంతకాలు పెడతున్నానని''- అన్నాడు కిరణ్‌. అదే పెద్ద జోక్‌ అన్నట్లు డీఎన్‌, రాజేంద్ర బాబు విరగబడి నవ్వారు. "ఇంతకి ఏంటి? '' అని రాజేంద్ర బాబు కేసి కొంటెగా చూసి కనుసైగ చేశాడు కిరణ్‌. కిరణ్‌ చెవిలో దూరిపోయి ఏదో చెప్పాడు రాజేంద్ర బాబు. మళ్లీ టక్‌ సర్దుకొని బయటకు వెళ్లిపోయాడు. ఇంతలో తలుపుతోసుకుంటూ ఈనాడు జర్నలిజం స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఎమ్మెన్నార్‌ వచ్చేశాడు. డీఎన్‌ మోహం మాడిపోయింది. " ఒకడెళ్లిపోతే మరొకడు వచ్చేసాడు. ప్రశాంతంగా ఒక్క క్షణం మాట్లాడనివ్వరు '' అని మనసులో తిట్టుకున్నాడు. "ఈ సారి పెట్టేద్దాం సార్‌.. ఎక్కువ సంతకాలు పెట్టడం మీద ఈజేఎస్‌లో ఒక కోర్సు పెట్టేద్దాం. చాలా ముఖ్యం మనకి.. '' డీఎన్‌కి ఇంకా వళ్లు మండిపోయింది. ఏం చేయాలో అర్ధం కాలేదు. "పెడదాం.. ఓ సారి రాహుల్‌ని కూడా అడుగుదాం.. ఆయన సంతకాలు పెట్టడం మీద అబీడ్స్‌ పేవ్‌మెంట్‌ మీద దొరికిన రెండు పుస్తకాలు రెండేసి రూపాయలు చొప్పున కొన్నానన్నాడు.. '' అన్నాడు డీఎన్‌. కిరణ్‌కి వాళ్లు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. అందుకోసం మౌనంగా అన్ని తెలుసన్నట్లు తలను ఊపుతూ కూర్చున్నాడు. హఠాత్తుగా గుర్తుకొచ్చినట్లు- "డీఎన్‌ మీరా పని చూడండి'' అన్నాడు. ఏ పనో ఇద్దరికి అర్ధం కాలేదు. కాని కోరస్‌గా 'ఓకే సార్‌!' అన్నారు. టక్‌లు సర్దుకుంటూ బయటకు వచ్చేశారు. "ఇంతకీ ఏం మాట్లాడటం కోసం లోపలికి వెళ్తారు? '' అన్నాడు ఎమ్మెన్నార్‌. "ఎడిటోరియల్‌కు సంబంధించిన ఇంపార్టెంట్‌ మాటర్‌.. పర్వాలేదు.. రేపో, ఎల్లుండో మాట్లాడతా '' అన్నాడు డీఎన్‌. ఇద్దరూ సైలెంట్‌ అయిపోయారు..

జూబ్లీహిల్స్‌ ఆంధ్రజ్యోతి ఆఫీసు.. ఎండీ రాధాకృష్ణ గది..

రాధాకృష్ణ హెచ్‌ఎంటీవీ చూస్తూ - దానిలో వస్తున్న వార్తలు చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నాడు. ఇంతలో తలుపుతోసుకొని రొప్పుకుంటూ ఎడిటర్‌ శ్రీనివాస్‌ వచ్చాడు. రాధాకృష్ణ తలెత్తి ఏం జరిగిందనట్లు చూశాడు. ఓ కుర్చీలో ఒదిగిపోయాడు శ్రీనివాస్‌. 'ఏం జరిగింది కేఎస్‌' అని ముద్దుగా అడిగాడు. "అక్షరం ఒణికింది సార్‌! '' అన్నాడు రొప్పుతూ. ఆర్‌కే ఒక క్షణం ఆలోచించాడు. "అయితే- ఇది వైఎస్‌ పని అని ఓ ఫస్ట్‌ పేజీ ఎడిటోరియల్‌ రాసేద్దాం '' అన్నాడు. శ్రీనివాస్‌ మోహం పాలిపోయింది. ఇక లాభం లేదన్నట్లు నెమ్మదిగా సన్నాయి నొక్కులు నొక్కటం మొదలుపెట్టాడు. "మనం రాసిన ఎడిటోరియల్స్‌ చూసి అక్షరాలు ఒణికిపోతున్నాయని అందరూ అనుకుంటున్నారు సార్‌.. నాకు ఉదయం నుంచి మూడు ఫోన్లు వచ్చేసాయి..'' అన్నాడు. మూడు అనే పదాన్ని గట్టిగా నొక్కి వక్కాణిస్తూ. ఆర్‌కే మోహంలో ఫీలింగ్స్‌ మారాయి. "మీకొచ్చే ఫీడ్‌బ్యాక్‌.. ఓకే..'' అన్నాడు కొద్దిగా నిరాశగా. ఒక్క క్షణం ఆగి మళ్లీ అన్నాడు. "ఈ మధ్య మీరు స్త్రీల సమస్యలపై- అదే..స్త్రీ వాద సమస్యలపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్టున్నారు.. అప్పుడప్పుడు పని కూడా చేస్తే బావుంటుంది.. '' అన్నాడు ఆర్‌కే. ఈ సారి కేఎస్‌ మోహంలో రంగులు మారాయి. "ఈ మధ్యనే బానే పనిచేస్తున్నా.. ఆ మధ్య రెండేసి వాక్యాలు చొప్పున ఆరు స్లోగన్స్‌ కూడా రాసిచ్చా కదా.. దాని వల్లే కదా.. మన సర్క్యులేషన్‌ నలభై వేలు పెరిగింది..'' అన్నాడు. "అవును..ఇలాంటి ప్రమోషనల్‌ వర్క్‌ వల్లే సర్క్యులేషన్‌ పెరుగుతుంది.. '' అని ఆగి- " అందరూ పనిచేస్తే ఈపాటికి ఈనాడును ఎప్పుడో బీట్‌ చేసేసేవాళ్లం'' అన్నాడు నిరాశగా. కేఎస్‌ ఈ మాటలేం పట్టించుకోలేదు. "నేను బయటకు వెళ్లాలి.. ఈ రోజు పేజీలు మీరు చూసుకుంటారుగా..'' అని మాట్లాడకుండా లేచి వెళ్లిపోయాడు..

జూబ్లీహిల్స్‌ సాక్షి ఆఫీసు..

గేట్‌ ముందు పది క్వాలిస్‌లు ఆగాయి. మధ్యలో ఉన్న కారు నుంచి జగన్‌- వైఎస్‌ స్టైల్లో దిగబోయాడు. గేట్‌ ముందు జనం ఎవరు లేకపోవటంతో పక్కనే ఉన్న విజయసాయి రెడ్డి వైపు కోపంగా చూశాడు. విషయాన్ని గ్రహించిన సాయిరెడ్డి వెంటనే రామకృష్ణరెడ్డికి, మురళీకి, రామ్‌కి- ఒకరి తర్వాత మరొకరికి ఫోన్లు చేశాడు. జగన్‌ ఏదో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ కార్లోనే కూర్చున్నాడు. పది నిమిషాల్లో సాక్షిలో పనిచేసేవారందరూ గేట్‌ ముందుకు వచ్చారు. "జనం కోసం జగన్‌.. జగన్‌ కోసం జనం'' అంటూ నినాదాలు చేయటం మొదలుపెట్టారు. జగన్‌ మోహంలో చిరునవ్వు వచ్చింది. వైఎస్‌ స్టైల్లో చేయి ఊపుతూ కారు దిగాడు. లిఫ్ట్‌ ఎక్కి పైకెళ్లిపోయాడు. "ఛీ.. వెధవ బ్రతుకైపోయింది.. మనుషులు లేకపోతే మన చేతే జై..జైలు కొట్టించుకుంటున్నారు కూడా..'' అన్నాడో పాత్రికేయమిత్రుడు. పక్కనున్న మరో వ్యక్తి ఉలిక్కి పడ్డాడు. "ష్‌.. గట్టిగా అనకు.. టీవీలో పనిచేసే మిత్రుడు ఇలాంటి కామెంటే చేశాడని-రామ్‌ అన్నయ్య వరసలో రెండు రోజులు తన రచనలు వినిపించాడుట. పాపం.. ఇప్పుడు హాస్పటల్‌లో ఉన్నాడుట.. ఇంకో ఆర్నెళ్లకి కాని మానసిక పరిస్థితి కుదుటపడదని డాక్టర్లు చెబుతున్నారట'' అన్నాడు. దీంతో సంభాషణ ఆగిపోయింది.

జగన్‌ రూమ్‌..

"మనం.. ఇంత చేస్తూంటే.. వీళ్లందరూ..'' అని వైఎస్‌ స్టైల్‌లో ప్రసంగిస్తున్నాడు జగన్‌. 'సార్‌.. ఇందాక జనాలు రాలేదు కదా.. అందుకని మన పేపర్‌ వాళ్లని రమ్మన్నాం.. ఇప్పుడు వచ్చి బక్షీష్‌ కావాలని మారాం చేస్తున్నారు..'' అన్నాడో పెద్ద మనిషి వచ్చి. జగన్‌ ఓ నిమిషం ఆలోచించాడు. "ఇది కూడా ఆ భజంత్రి పత్రికల కుట్రే అయిఉంటుంది.. నేను ఎంపీనైన తర్వాత ఎంపీల్యాడ్స్‌లో నుంచి జర్నలిస్టులకు బక్షీష్‌ ఇస్తానని చెప్పండి'' అన్నాడు. వచ్చిన పెద్ద మనిషి ఏదో చెప్పబోయాడు. జగన్‌ వెనకున్న గార్డు రివాల్వర్‌ తీయటం చూసి.. గప్‌చుప్‌ అయిపోయాడు..

-మహాశ్రీ

Friday, February 13, 2009

కొంచెం ఇష్టం- కొంచెం కష్టం


కొంచెం ఇష్టం- కొంచెం కష్టం

మీడియా రంగం చాలా చిత్రమైన పోకడలు పోతోంది. ఇటు దినపత్రికలు, అటు టీవీ ఛానల్స్‌ ప్రజల అభిష్టానికి అతీతంగా తమ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి. మీడియా అంటే జర్నలిస్టులే కదా.. వీళ్లు ఏం చేస్తున్నారు? మేనేజిమెంట్‌ల చేతుల్లో బొమ్మలయిపోయారా? ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడు తలెత్తుంటాయి. జర్నలిస్టులు, మేనేజిమెంట్లు ఒకరిని మరొకరు ముద్దుముద్దుగా విమర్శించుకుంటారు. చివరకు అందరూ కలిసి- ముత్యాల చెమ్మచెక్క.. రత్నాల చెమ్మచెక్క.. ఓ చెలి ఆడుదుమా.. అని పాట పాడుకుంటూ కలిసిపోతారు. ఈ మొత్తం వ్యవహారంలో గాడిదలయ్యేది ప్రేక్షకులు,పాఠకులే. వీరి కోసం తయారుచేస్తున్న బ్లాగే ఇది. ఇది అందరికి కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా ఉంటుంది. మీడియా ఆఫీసుల్లో ఏం జరుగుతోంది దగ్గర నుంచి వార్తలు ఎలా కవర్‌ చేస్తున్నారు దాకా సునిశితమైన పరిశీలన మీకు ఇందులో దొరుకుతుంది. చివరగా ఒక మాట.. ఇది కేవలం జర్నలిస్టుల కోసం మాత్రమే కాదు.. న్యూస్‌ పేపర్లలో వార్తలు చదివే అందరి కోసం.. రండి..చదవండి.. మమల్ని ఆదరించండి..
- మహాశ్రీ